Telugu Hindu Tradition : Bhoomi Pooja –
భూమికి మూడు రకముల దోషములు ఉంటాయి. స్పర్శాదోష, దృష్టి దోషం, శాల్యా దోషం స్పర్శాదోషం అనగా ముట్టుకుంటే వచ్చే కొన్ని రకముల క్రిమి కీటకముల వల్ల వచ్చే దోషము. దృష్టి దోషం అనగా పరుల నరదృష్టి వల్ల వచ్చే దోషము. మృత్యు దోషము లేదా శాల్యా దోషము అనగా మరణించిన శరీరము యొక్క అవశేషాలు ఉన్నా, చనిపోయిన ఆ చోటుగా ఉన్న ఆ చోట దేవతావాహనం జరగదు. కాబట్టి అటువంటి చోట పవిత్రతను పెంచడానికి శంఖువును స్థాపిస్తారు దానిని భూమి పూజ లేదా వాస్తు పూజ అంటారు. కాబట్టి ఆ చోట పవిత్ర తను పెంచడం మళ్లీ పంచభూతాలతో నిర్మితమైనా శరీరం లాంటి ఒక నిర్మాణాన్ని నిర్మిస్తున్నాను కాబట్టి దానిలో ప్రాథమికమైన ప్రాణాన్ని నిలిపే ప్రక్రియను భూమి పూజ లేదా శంకుస్థాపన లేదా వాస్తు పూజ అని అంటారు.
ఏ భాగంలో శంకుస్థాపన చేయాలి?
ఇంటి పొడవును తొమ్మిది భాగాలుగా చేయాలి. ఇందులో పాదాల నుంచి మూడు భాగాలు విడిచి పెట్టాలి. మిగిలిన మూడు భాగాలలో వాస్తు పురుషుడి పాదాలున్న దిశ రెండు భాగాలు వదలాలి. మిగిలిన భాగమే వాస్తు పురుషుడి నాభి స్థానం.
ఈ నాభి స్థానంలో తవ్వి నవధాన్యాలతో శంఖువును స్థాపించాలి. ముందు శంఖువును ధాన్యరాశిపై వుంచి వాస్తుపూజ చేశాక శంఖుస్థాపన చేయాలి. గంధపు చెక్కతో కానీ, మారేడు, అత్తి, మద్ది, వేప, చంద్ర కొయ్యతో గానీ శంఖువును తయారుచేస్తారు.
పూజ చేసే విధానము :
ముందుగా యజమాని లేదా భూమి ఉన్న వ్యక్తి వారి పేరున యోగ్య మైనది మంచి ముహుర్తము చూసుకోవాలి. తరువాత పురోహితుడు సహాయంతో పూజ ఏర్పాట్లు చేసుకోవాలి. మొదటి పూజ గణపతి పూజ .ఆటంకములు విఘ్నములు తొలిగి ఇల్లు సుభిక్షంగా ఉండాలని చేసే పూజ. రెండవది పుణ్యాహవాచ నము అన్ని రకముల మాలి న్యములు తొలగించి పవిత్రతను కలిగించే పూజగా పుణ్యాహవచనంని చేస్తారు. మూడవది సూర్యుడు మొదలైన తొమ్మిది మంది గ్రహములను పూజిస్తారు. దీనివల్ల గ్రహదోషములు పోతాయి. నాలుగవది వాస్తుపూజ శంఖుపూజ చెక్కతో చేయబడినటువంటి శంఖానికి జనపనార చుట్టి రత్నముల చేత పొదిగి షోడశోపచారములు చేత పూజిస్తారు.
ఈ శంఖాన్ని తీసుకొని కట్టడానికి ఈశాన్య భాగంలో భూమిలోపల స్థాపన చేసి పూజించి పూడ్చి వేస్తారు. దీనినే వాస్తు పూజ, భూమి పూజ అనే పేర్లతో పిలుస్తారు. శంఖుస్థాపన సమయంలో మనం ఉపయోగించే పూజా ద్రవ్యాలు, నవధాన్యాలు వగైరా గృహం లోపలకు వచ్చే విధంగా చూడాలి. అంటే ఆ తీసిన గుంత మధ్యలో లేదా ఇంకొంచెం లోపలకు ఉండే విధంగా పాతి పెట్టాలి. గృహారంభం ఈశాన్యంలోనే చెయ్యాలని, వేరే చోట్ల చెయ్యకూడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
శంకుస్థాపనకు శుభగ్రహాల బలం ఏ విధంగా ఉండాలి?
శంకుస్థాపన లగ్నానికి శుభగ్రహాల బలం ఎంతగా కలిగినప్పటికీ సూర్యుడు– అంగారకుడు, శని తృతీయ – షష్టమ – ఏకాదశ స్థానాలలోగానీ, ఉచ్చ–మూల త్రికోణ– స్వక్షేత్రాలలో గాని ఉండాలి. లగ్నానికి 4-8 స్థానాలలో ఏ గ్రహాలు ఉండరాదు.
గురుబలం ఉన్న ముహూర్తాల్లో గృహప్రవేశం, శంకుస్థాపన చేసిన సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది. వైశాఖమాసంలో శుభదాయకమని, జ్యేష్టమాసంలో సామాన్యంగా ఉంటుంది.
ఆషాఢమాసంలో హానికరమనీ, శ్రావణమాసంలో ధనాభివృద్ధి చేకూరుతుందని, భాద్రపదమాసంలో దరిద్రమనీ, ఆశ్వీయుజంలో గౌరవం చేకూరుతుందనీ, కార్తీకంలో ఆర్థికాభివృద్ధి, ఆధ్యాత్మిక చింతన పెరుగు తుందనీ, మార్గశిరంలో ధనప్రాప్తి కలుగుతుందనీ, పుష్యమాసంలో అశాంతి అని, మాఘ, ఫల్గుణ మాసాల్లో సంకల్పసిద్ధి చేకూరుతుందని ముహూర్త శాస్త్రం చెపుతుంది.
శంఖుస్థాపనకు ఏ సమయం మంచిది?
శంఖుస్థాపనకు మొదటి ఝాము ప్రశస్తం. రెండు ఝాము – మూడో ఝామున కూడా శంకు స్థాపనం చేయవచ్చు. కానీ, నాల్గవ ఝామున మాత్రం చేయరాదు. ఇల్లు కట్టుకునే ముందుగా శంఖుస్థాపన చేయడం వలన దోషాలు చాలావరకు తొలగి శుభ పరిణామాలు జరుగుతాయి. శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమిలో శంకుస్థాపన, గృహప్రవేశాలు చేయరాదు. పుష్య, ఆషాఢ, భాద్రపద మాసాలలో శంఖుస్థాపన గాని, గృహప్రవేశం కాని చేసిన హానికరం.