బతుకమ్మ పండుగ

Batukamma Festival

Telugu Traditional Festival : Batukamma Festival –

ఆశ్వయుజ మాసంలో 9 రోజులపాటు జరుపుకునే బతుకమ్మ పండుగ సాధారణంగా అక్టోబరులో వస్తుంది. అప్పటికి వర్షాలు తగ్గుతాయి. పంటకోతలు దాదాపుగా పూర్తయ్యే సమయం. అంటే వ్యవసాయ పనుల హడావుడి తగ్గుతుంది.

చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తాయి. అంతటా పచ్చదనం పరచుకుని ఉంటుంది. తెలంగాణ మెట్ట ప్రాంతం. ఎక్కడ చూసినా తంగేడు, గునుగు, బంతి, గన్నేరు పూలు విస్తారంగా పూసి ఉంటాయి. పెరళ్లలో గుమ్మడి, ఆనప, నేతిబీర పాదులనుంచి పాకి ఉంటాయి. మొత్తానికి గ్రామాలన్నీ తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి.
పండుగలో బతుకమ్మకు పూజతోపాటు ఆటాపాటా మిళితమై ఉంటాయి. నామ రూప భేదాలతో కొంచెం అటు ఇటుగా పండుగ భారతదేశమంతటా కనిపిస్తుంది. గర్బా, దాండియా, తీజ్, ఓనం, అట్లతద్ది, బొడ్డెమ్మ తదితర రూపాల్లో ఉంటుంది. బతుకమ్మ పండుగ చెరువులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉంటుంది.


బతుకమ్మ మొదట గ్రామదేవత. గ్రామీణులు సృష్టించిన అమ్మదేవత. తర్వాత శైవం ఆమెకు శివుని సతిస్థానం ఇచ్చి గౌరమ్మని చేసింది. తర్వాత వచ్చిన వైష్ణవం సాక్షాత్తూ లక్ష్మీదేవే బతకమ్మ అని ప్రస్తుతించి ప్రచారంలో పెట్టింది.

పండుగకు నీటికి ఉన్న సంబంధం ఏంటంటే? తంగేడు, గునుగు, పసుపుముద్ద, తమలపాకులు చెరువునీటిని శుద్ధి చేయడమే కాకుండా, అవి కుళ్లి నీటి అడుగుకుపోయి చెరువు మట్టిని సారవంతం చేస్తాయి. వేసవిలో మట్టిని రైతులు పొలాల్లో వేయడం వల్ల పొలాలు సారవంతం అవుతాయి. ఇది ప్రతి ఏడూ జరిగే ప్రక్రియ. అందుకే ఇది చెరువుల పండగ. ఇది నూరు శాతం మహిళల పండుగ. అచ్చమైన అస్తిత్వ పండుగ. ఇలా ఊరి వారందరికీ బతుకును ఇచ్చే అమ్మ బతుకమ్మ.

అలంకరణ కళ

మొదట తాంబాళం లేదా తబుకు పై గుమ్మడి ఆకులు పరుస్తారు. వాటికింద నూలు దారాలను రెండు వరుసల్లో ప్లస్ ఆకారంలో వేస్తారు. గోపురాకారంలో పేర్చిన బతుకమ్మ పూలు జారిపోకుండా దారాలను ఆధారంగా కడతారు. బతుకమ్మను పేర్చడానికి గుమ్మడి ఆకు, తంగేడు, గునుగుపూలు తప్పనిసరిగా ఉండాలి. మొదటి వరుసలో తంగేడు పూలను పెడతారు. మధ్యలో తుంచిన పూల కాడలు, ఆకులను వేస్తారు.

సాధారణంగా ప్రతి రెండో వరుసా తంగేడు పూలదే ఉంటుంది. గునుగు పూల చివరలు చిదిమేసి పదిపన్నెండు పూలను ఒక కట్టగా కట్టి, కొన్ని వరుసల్ని పేరుస్తారు. గునుగు పూలు అరతెలుపు రంగులో ఉంటాయి. అందుకని వీటిని ఆకుపచ్చ, గులాబీ, నీలిరంగులో ముంచి వర్ణరంజితం చేస్తారు. ఇలా ఒక వరుస తంగేడు, ఇంకో వరుస గునుగు పూలను మూడు, నాలుగు వరుసల్లో గోపురాకారంలో పేరుస్తారు. తర్వాత లభ్యతను బట్టి బంతి, చేమంతి, గన్నేరు పూలను పేరుస్తారు. పైన తమలపాకుల్లో త్రిభుజాకారంలో పసుపు ముద్దకు కుంకుమ, పసుపుబొట్లు పెడతారు. అగరువత్తులు అంటించి బతుకమ్మకు అలంకరణ పూర్తిచేస్తారు. అందుకేపసుపులో పుట్టిన గౌరమ్మ/పసుపులో పెరిగిన గౌరమ్మ/పసుపులో వసంతమాడేవా…” అంటూ పాడతారు.

ఇలా అలంకరించిన బతుకమ్మను ఇంటి వాకిట్లోకి తీసుకొస్తారు. మొదట ఎవరి ఇళ్ల వద్ద వాళ్లు ఆడాక ఊరిలో ఉండే గుడి వద్దకు చేరతారు. అక్కడ డప్పులు, కొమ్ము వాయిద్యాలు గంభీరంగా నినదిస్తుంటే చప్పట్లతో అంతా కోలాహలంగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి స్త్రీలంతా ఊరి చెరువుకు బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి తరలివెళ్లారు. తమ వెంట ఎవరికి వీలైన సద్దులను (ఫలహారాలను) వారు తీసుకెళ్తారు. అందుకే మహర్నవమి నాటి బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు.

సాధారణంగా మలీద, సున్నుండలు, సర్వపిండి, పోలెలు, తియ్య టప్పాలు, పులిహోర, అటుకులు, పేలాలు, నానబెట్టిన పెసలు, శనగలు, అరిసెల వంటివి సద్దులుగా తీసుకెళ్తారు.

ఇంకొందరేమో మొదటి రోజున వాయనంగా ఆకువక్కలు, తులసి దళాలు ఇచ్చుకుంటారు. రెండో రోజున పప్పు బెల్లాలు, మూడో రోజున ఉడికించిన బెల్లం శనగపప్పు (పూర్ణం), నాలుగో రోజున పాలల్లో నాన బెట్టిన బెల్లం బియ్యం, ఐదో రోజున అట్లు, ఆరో రోజున అరిసెలు, ఏడో రోజున బజ్జీలు, ఎనిమిదో రోజున నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలి (వెన్నముద్దలు), తొమ్మిదో రోజున పెద్ద బతుకమ్మ లేదా సద్దుల బతుకమ్మ కాబట్టి పులిహోరా, చిత్రాన్నం లేదా ప్రధాన వంటకాన్ని నైవేద్యంగా చేస్తారు. మనిషికి ప్రకృతికి ఉన్న సంబంధం మనం జరుపుకునే పండుగల్లో వ్యక్త మవుతుంటుంది. ఇలాంటి పండుగలు తర తరాలకు ప్రవహిస్తూ మన తెలుగు సంప్రదాయాల ఔన్నత్యాన్ని తెలియజేస్తాయి. అలాంటిదే బతుకమ్మ పండుగ.

 

Read More : సమ్మక్క సారలమ్మ జాతర

Leave A Reply

Your Email Id will not be published!