Telugu Traditional Games : Avva – Appachcha –
“అవ్వా – అప్పచ్చా” చాలా తమాషా అయిన ఆట. ఇద్దరు పిల్లలు కుడి ఎడమ చేతులు ఒకరి భుజాలు మీద ఒకరు వేసుకొని, రెండో చేతి వేళ్ళను కలిపి పట్టుకొని మొత్తం మిద చేతులను కుర్చీలా అమర్చుతారు. దానిమీద ఒక పిల్లను ఎక్కించి ఏనుగు అంబారి మోసినట్లు ఊరేగిస్తారు.
“అవ్వా–అప్పచ్చా” ఆటను ఆడాలంటే ముగ్గురు పిల్లలు ఉండాలి. ఎక్కువ మంది ఉంటే, పిల్లల్ని మార్చి మార్చి ఆడుకోవచ్చు.
ముందుగా ముగ్గురూ వలయంగా నిలబడి చేతులు పట్టుకొని పంటలు వేయాలి. ముందుగా ఎవరు పండితే వారిని ఏనుగుమీద ఎక్కిం చాలి. మరి ఏనుగు ఏది? మిగతా ఇద్దరూ ఏనుగుగా మారతారన్నమాట. ఇద్దరు పిల్లలు ఎదురెదురుగా నిలబడతారు. తమ కుడి అరచేతులను నోటికి నొక్కి “అవ్వా – అప్పచా” అని ఎడమ చేతిని పైకిలేపి నిచ్చెన కట్టాలి. ఎదురు బాలుడు కూడా అలాగే కట్టాక ఇద్దరూ చేతులు కలుపుతారు. ఇప్పుడు ఆ నిచ్చెన ఏనుగు అన్నమాట. –
పండిన పిల్లవాడిని చేతుల మధ్య కూర్చుండ బెట్టుకుని, పైకిలేపి ఊరేగించాలి. అప్పుడు ఇలా పాడాలి.
“ఏనుగమ్మా! ఏనుగు ఏనుగు ఒళ్ళు నల్లనా
ఏనుగు కొమ్మలు తెల్లన ఏనుగు మీదా రాముడు
ఎంతో చక్కని దేవుడు.” ఇలా పాడుతూ చివరిదాకా తీసుకెళ్లి అక్కడే దించాలి. ఇప్పుడు రెండో బాలుడు, ఆ తర్వాత మరొకరు ఇలా పిల్లలంతా “అవ్వా – అప్పచ్చా” ఆడతారు. చూసేవారికి, ఆడవారికి కూడా ఈ ఆట ఆనందాన్ని ఇస్తుంది.