Telugu Traditional Game : Ashta Chamma –
అష్టాచెమ్మా ఆటను నేడు కూడా చిన్నా పెద్దా, ఆడామగా అనే తారతమ్యం లేకుండా గవ్వలతోను, చింత పిక్కలతోను సరదాగా ఆడుకుంటారు. ఈ ఆటకు నాలుగు గవ్వ లను ఉపయోగిస్తారు. వీటిని పందెపు గవ్వలంటారు. అష్టాచెమ్మా పటము గీసి ఆట ఆడుదురు. ‘X’ గుర్తు ఉన్న గళ్ళలో మధ్య నున్న దానిని వంట గడి అనీ, నాలుగు వైపులా ‘X’ గుర్తులు ఉన్న గళ్ళను ఆట గళ్ళని అందురు.
ఈ ఆట సాధారణంగా ఇద్దరుగాని, నలుగురుగాని ఆడుదురు. ఎక్కువమంది ఉన్నప్పుడు ఇద్ద రేసి, ఉజ్జీలుగా ఉండి ఎనిమిదిమంది కూడా ఆడవచ్చును. నాలుగు వైపులా ఉన్న ఆటగాళ్ళల్లో ఒక్కొక్కరు నాలుగేసి చొప్పున నలుగురు నాలుగు రకాల చింత పిక్కలుగాని, గవ్వలు గాని, రాళ్ళు గాని ఆటకాయలుగా పెట్టుకొందురు.
పందెపు గవ్వల్ని నేలపైన విసరి పందెము వేసినప్పుడు అందులో ఒక గవ్వ తిరగబడి మూడు బోర్ల పడితే ‘కన్ను‘ అనీ, రెండు తిరగబడి రెండు బోర్లపడితే ‘రెండు‘ అనీ, మూడు తిరగబడి ఒకటి బోర్లపడితే ‘మూడు‘ అనీ, నాలుగూ తిరగబడితే ‘చెమ్మా‘ అనీ, నాలుగూ బోర్ల పడితే ‘అష్టా‘ అని పేర్లు. కన్నుకి ఒకటి, రెండుకి రెండు, మూడుకి మూడు, చెమ్మాకి నాలుగు, అష్టాకి ఎనిమిది గళ్ళ చొప్పున ఆటకాయలను నడుపుదురు. కాయ గళ్ళలో నడిచి చుట్టు తిరిగి వెళ్ళి చంపుడు దొరకగానే లోపలి గళ్ళలోకి దిగి, మళ్ళీ చుట్టు తిరిగిన తరువాత పండుతుంది.
ఇలాగే తక్కిన గళ్ళలో ఉన్న కాయలును ఆయా గళ్ళ ప్రకారం లోపలికి దిగి పండును. పందెం వేసినప్పుడు చెమ్మా పడితే ఒక కాయ, అష్టాపడితే రెండు కాయలు విడుతాయి. అష్టా, చెమ్మా పందెములు పడినప్పుడు మాత్రం మళ్ళీ మరొకసారి పందెము వేయుదురు. ఈ పందెమును పై పందెములకు కలిపి కాయను నడుపుకొందురు. వరుసగా మూడు అష్టాలు గాని, మూడు చెమ్మాలు గాని పడినప్పుడు మరల నాలుగో పందెం అదే పందెం పడితేనే లెక్క పెట్టుదురు. లేకపోతే లెక్క పెట్టరు.
ఇట్లు లెక్కపెట్టని పందెములను ‘మురిగిళ్ళు‘ ‘మురిగీసు‘ అని అందురు. మూడు పందెములు మురిగి పోయినవని వాటి అర్థము. ఆటగళ్ళలో ఉన్న పిక్కలను చంప కూడదు. అందువల్ల ఆ స్థలాలలో కాకుండా బయటి గళ్ళలో రెండో మనిషి కాయ ఉన్నట్లయితే, తాను వేసిన పందెముతో తన కాయ అక్కడికి వచ్చేటట్టుగా నడిపించి అక్కడున్న బయటివారి కాయను తీసివేయుదురు. దీనినే చంపడం అందురు. ఎవరి కాయలైనా చంపబడి ఉన్నప్పుడు వారు పందెం వేసే సమయంలో అష్టాచెమ్మాలలో ఏదైనా పడితే చెమ్మాకి ఒకటి, అష్టాకి రెండు చచ్చిన కాయలను విడిపించు కొనవచ్చును. ఈ విడిపించు కొన్న కాయలను తిరిగి వారి గళ్ళలో పెట్టుకొని యథాపూర్వక ముగా ఆట ఆడుదురు. ఆటగళ్ళలో ఎన్నికాయలైనా ఉండవచ్చును.
మొదట పండిన వాళ్ళు మాత్రం తక్కిన అందరినీ ఓడించినట్లే.