అంత్యేష్టి
Anthyesti - Funeral
Telugu Hindu Tradition : Anthyesti – Funeral –
హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతని ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి,
మరణానికి ముందు
మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారి పేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.
అంతిమయాత్రకు ముందు
చనిపోతున్నవారి నోట్లో దగ్గరివారు తులసితీర్థం, గంగాజలం మొదలైన పవిత్ర జలాలను పోస్తారు.
అంతిమయాత్ర సాగే విధానం
పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దాని మీదికి చేరుస్తారు. అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు. అనుసరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించిన వ్యక్తి తరపున దానంగా ఇస్తారు.
దింపుడుకళ్ళెం: భగవదనుగ్రంవల్లో లేదా మారేదైనా కారణాల వల్ల చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వలనో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్నినిమిషాల సేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరు పెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్లే ఈ ఆచారం పుట్టి ఉంటుంది.
దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతో బాటు అంత్యక్రియల్లో భాగంగా చేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.
ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు. ఓదార్పు : ఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవిత సత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.
అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సర కాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతక మని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం). అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థి సంచయనం.