ఓమన గుంటలు

Omana Guntalu

Telugu Tradional Games : Omana Guntalu –

వామన గుంటలు పాత కాలపు ఆట. సుమారు 1950 తరువాత క్రమేపీ మరుగున పడిపోయింది. ఓమన గుంటలు ఇంటిలో కూర్చొని ఆడుకొనే ఒక ఆట. దీనినే వానగుంటలు, ఒనగండ్లు, బద్దీలాట అని కూడా వ్యవహరిస్తారు. ఆట కోసం ప్రత్యేకంగా తయారుచేసిన చేప ఆకారం లో ఉన్న కొయ్యపెట్టె. మరబందు పెట్టి తయారు చేయబడిన రెండు పలకల కొయ్య సాధనం. ఇది తెరచుటకు మూయుటకు వీలుగ నుండును. దీనిలోపల ఒక్కొక్క పలకకు ఏడు గుంటలుగా రెండు పలకలకు కలిసి పదునాలుగు గుంటలు తొలచి యుండును. ఒక్కొక్క గుంటలో పద మూడేసి చింత గింజలనుగాని, కుంకుడు గింజలు లాంటివి పోయుదురు.

ఆట ప్రారంభంలో ఆట ఆడువారు ఒక గుంటలోని గింజలని మొత్తం తీసుకొని ఖాళీ చేసిన గుంటకు కుడివైపు గుంటతో ప్రారంభించి వరుసగా ఒక్కొక్క గుంటకు ఒక గింజ చొప్పున పంచడం ప్రారంభిస్తారు. చేతిలోని గింజలన్నీ అయిపోతే తరువాత గుంట ( గుంట ఎవరిదైనా కావచ్చు) లోని రాళ్లను తీసి పంచడం కొనసాగిస్తారు. ఇలా చేతిలోని గింజలన్నీ అయిపోయి పంచడానికి వీలులేకుండా ఖాళీ గుంట వచ్చే వరకు ఒకే వ్యక్తి పంచుతూ ఉంటారు.

అలా చేతిలోని గింజలన్నీ అయిపోయి తరువాత ఖాళీ గుంట తటస్థ పడితే ఖాళీ గుంట తరువాత గుంటలో ఉన్న గింజలన్నీ పంచిన వ్యక్తి గెలుచుకుని గుంటలో నుండి తీసుకొని పక్కన పెట్టుకుం టుంది. ఖాళీ గుంట తటస్థపడి దాని తరువాత గుంట కూడా ఖాళీగా ఉంటే మీ తడవు ముగుస్తుంది కానీ గింజలు మాత్రం ఏమీ గెలుచుకోరు. తరువాత ఎదుటి ఆటగానికి పై విధంగా పంచే అవకాశం వస్తుంది. పంచడం ప్రారంభం మాత్రం మన అర్ధభాగములోని గుంటలతోనే ప్రారంభించాలి. ఆట చివరి దశలలో ఒక ఆటగానికి పంచే తరుణం వచ్చినా పంచడం ప్రారంభించడానికి తన అర్ధ భాగములోని గుంటలన్నీ ఖాళీగా ఉంటే పంచలేడు. ఇక పంచే అవకాశము తిరిగి ఎదుటి వ్యక్తికి ఇవ్వవలసిందే.

వరుసగా పంచేటప్పుడు ఒక గుంటలో పంచకుండా దాటెయ్యడము, వ్యతిరేక దిశలో పంచడము నిషిద్ధము. ఒక వ్యక్తి పంచుతుంటే అవతలి వ్యక్తి జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు.

ఇలా ఒకరి తర్వాత ఒకరు పీటలోని గుంటలన్నీ ఖాళీ అయ్యేదాకా ఆడతారు. చివరలో ఎవరెన్ని గింజలను గెలుచుకున్నారో లెక్కపెడతారు. అత్యధిక గింజలు గెలుచ్కున్నవారే విజేతలు.

అంతేకాక ఖాళీ గుంటలలో కాయలు పడినపుడు అవి నాలుగు కాయలు కాగానేఆవుఅని తీసుకొందరు. అట్లు తీసుకొనక పోయినచో అవి మురిగి పోయినట్లే. మరల ఎనిమిది కాయలు గుంటలో చేరిన తరువాత కాని వానిని తీసుకొనవలెను.

అత్తా కోడళ్ళాట

ఏదన్నా గుంట నుండి మొదలు పెట్టి మూల నున్న గుంట ఖాళీగ ఉండి మన చేతిలొ ఒకె గింజ ఉంటే అది గుంటలో వేయకుండా గుంట పైన పెట్టి అది తమ ఇల్లు అంటారు. అందులో ఎన్ని గింజలు పడితే అన్ని వారివే. వేరేవాళ్ళు అందులో గింజలు వేయకూడదు. దీనిని కొన్ని ప్రాంతాలవారు అత్తాకోడళ్ళాట అని అంటారు.

దొంగా పోలీసు

ఇందులో ఒక గుంట నుండి అన్ని గింజలు తీసి పక్క గుంటలో వేయాలి. మళ్ళీ పక్క గుంట నుండి తీసి పక్క గుంటలో వేయాలి. అలా ఖాళీ గుంట రాగానే తట్టి పక్క గుంటలోని గింజలన్నీ తీసుకోడమే దొంగా పోలీస్ ఆట.

 

Read More : చెమ్మ చెక్క – చారడేసి మొగ్గ

Leave A Reply

Your Email Id will not be published!