అచ్చనగండ్లు
Accaanagandlu
Telugu Traditional Games : Accaanagandlu-
ఈ ఆట ప్రతి పల్లెలో ఆడపిల్లలు ఇంటి పట్టున కూర్చొని ఆడుకునే ఆట. ఈ ఆటను ఐదు గచ్చకాయలతో ఎందరైనను ఆడవచ్చును. ఐదు గచ్చకాయలను చేతితో పట్టుకొని అందులో ఒక కాయను మాత్రము పై కెగురవేసి ఆ కాయ మరల క్రిందికివచ్చు వ్యవధిలో చేతిలోని నాలుగు కాయలు నేలపై విడిచి ఎగురవేసిన కాయను పట్టుకొని ఆ కాయనే మరల ఎగురవేసి క్రింది.
కాయలను ఒక్కసారి నాలుగు కాయలను, రెండవసారి మూడు కాయలను, మూడోసారి రెండేసి చొప్పున రెండు సార్లుగా నాలుగు కాయకలను, ఒక్కొక్కమారు ఒక్కొక్కటి చొప్పున విడివిడిగా నాలుగు కాయలను చేతిలోనికి జరుపుకొని పైకెగురవేసిన కాయనందుకొందురు. నిర్ణీతమైన ఒక సంఖ్యను నియమించుకొని ఆ సంఖ్య వరకు ముందెవ రాడెదరో వారు గెలిచినట్లు నిర్ణయించుకొందురు.
ఆడునప్పుడు కాయలను ఎగురవేసి పట్టుటయందుగాని, జరుపుట యందుకాని తప్పి పోయినచో ఆట తప్పినట్లు భావించి తోటి బాలికలు ‘చెంగనాలో చెంగనాలు‘ అని అరచుచు ఆటను ప్రక్క బాలికకు ఇచ్చెదరు. ఈ ఐదు కాయలతో ఆడు ఆటలో అనేక భేదములు చూపుచు ఆడుదురు. కుప్పిలు, పువ్వీలు, రెండు కాయలు, ఒక్కం కాయ, మూగ కుప్పీలు, సీతమ్మ వారి పువ్వీలు, అద్దుడు కుప్పలు, కుంకుమ భరిణెలు .. ఇట్లా వేరు వేరు పేర్లతో ఆడుదురు. “ఒకటి ఓ చెలియా, రెండు రేవన్నా, మూడు ముచ్చిలుకా, నాలుగు నందన్నా, అయిదు అరటిపండు, ఆరుం జవ్వాదీ, ఏడుం బేడీలూ, ఎనిమిది ఎలమందా, తొమ్మిది తోకుచ్చూ, పట్టెడా” అనే పాటను పాడుచూ చాలా సంతోషంగా ఆడుకుంటారు. గచ్చకాయలు దొరకని చోట చిన్న చిన్న గులక రాళ్ళతో కూడా ఆ ఆటను ఆడుకుంటారు.
నాలుగు పిక్కల్ని పుంజి అంటారు. రెండు పుంజీలు ఓ కచ్చటం, ఐదు కచ్చడాలేమో గుర్రం, ఐదు గుర్రాలు కలిపితే ఓ ఏనుగు. ఎవరెక్కువ ఏనుగుల్ని చేస్తే వాళ్లు గెలిచినట్టు. దీనికి చింత పిక్కల్ని కుప్పగా పోయాలి. ఒక పిక్కని ఎగిరేసి పట్టుకునేలోగా నాలుగు పిక్కలు కుప్పలోంచి వేరుచెయ్యాలి. అప్పుడు ఓ పుంజి అవుతుంది. ఇలా పై పిక్కని పట్టుకో లేనంత వరకూ ఆట సాగుతుంది.