కూచిపూడి నృత్యం
Kuchipudi Dance
Telugu Classical Dance Tradition : Kuchipudi Dance – కూచిపూడి నృత్యం :
కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి (మొవ్వ మండలం) గ్రామంలో ఆవిర్భవించింది. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతము లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దీనికి ఈ పేరు వచ్చింది. ఇది దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచింది.
కూచిపూడి ఆరాధకులుగా శాతవాహనులు
3000 ఏళ్ళ క్రితం భరతముని ఈ నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలని వివరించాడు. ఒక పద్యం ద్వారా అప్పట్లో నాలుగు విధములైన నృత్యం ఉన్నట్లు గోచరిస్తూ ఉంది. వీటిలో దక్షిణ భారతానికి చెందిన దక్షిణాత్య కూచిపూడికి పూర్వ విధానమని తెలుస్తున్నది. 2వ శతాబ్దంలో శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి గాంచారు.
దశాబ్దాలుగా ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవారాధనకే అంకితమైనాయి. అందుకే ఈ రూపాన్ని భాగవత మేళ నాటకం అంటారు.
అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు.
ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్లు కనిపిస్తాయి. చాలాకాలం వరకు కూచిపూడి నృత్యం దేవాలయాలలోనే ప్రదర్శింపబడేది.
సాంప్రదాయం ప్రకారం, పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు.
15వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో స్త్రీలు కూడా నాట్యం చేయ డానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి, , దానిని పరిపుష్టం గావించాడు.
అతని అనుచరులైన బ్రాహ్మణులు కూచిపూడిలో స్థిరపడి ఈ నాట్యాన్ని అభ్యసించటంతో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి కూడా సిద్ధించింది.
ధారవుతో ప్రారంభమయ్యే కూచిపూడి ప్రదర్శన
కూచిపూడి నృత్య ప్రదర్శన గణేశ స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఆ పై ఒక్కొక్క పాత్ర వేదికను అలంకరించి ధారవు (ఒక చిన్న సంగీత, నాట్య రూపం) తో స్వీయ పరిచయం చేసుకొంటారు. దీని తర్వాత కథ మొదలౌతుంది. ప్రక్కన ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు, తంబూరా వంటి వాద్యపరికరాలను ఉపయోగిస్తారు.
బూరుగుతో ఆభరణాలు
చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహ భంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభి నయం, భావాభినయం చేయడంలో ఉద్దండులు. నృత్యకారులు నృత్య సమయంలో ధరించే ఆభరణాలు తేలికగా ఉండే బూరుగు అనబడు చెక్కతో చేస్తారు.
కూచిపూడికి, భరతనాట్యానికి దగ్గర పోలికలు
కూచిపూడి భరత నాట్యానికి దగ్గరగా ఉంటుంది. ఒకే పాత్రగల నృత్యాల గాత్రాలలో జాతిస్వరం, తిల్లానాలు ఉంటాయి. అదే నృత్యం అయితే భక్తుడు దైవంలో ఐక్యమయ్యే కాంక్షను తెలియజేసే సాహిత్యం ఉంటుంది. శైలిలో భరతనాట్యంతో పోల్చినపుడు గల భేదాలతో బాటు కూచిపూడికి ప్రత్యేక నాట్యరీతులు ఉన్నాయి.
అనాది కాలం నుండి కూచిపూడి నృత్య శైలి ప్రామాణిక గ్రంథాలైన అభినయ దర్పణ, నందికేశ్వర భరతర్జవల పై ఆధారితం. ఈ శైలిని నట్టువ మాల, నాట్య మాలగా విభజించారు.
నట్టువ మాల రెండు రకాలు
పూజా నృత్యం: గుడిలో బలిపీఠం పై ప్రదర్శించేది. కాళికా నృత్యం: కళ్యాణ మండపంలో ప్రదర్శించేది.
నాట్య మాల మూడు రకాలు సాంప్రదాయిక నృత్యం : దేవతలకై ఉద్దేశింపబడ్డది. కాళికా నృత్యం : మేధావులకై ఉద్దేశింపబడ్డది. సాధారణ నృత్యం : భాగవతం అను రకం.
కూచిపూడికి పునాది అయిన నాట్య మాల పురుష సమూహం చేసే నృత్య రూపకం. ఇందులో స్త్రీ పాత్రలు కూడా పురుషులే అభినయిస్తారు. ఇది మూడు రకాలు
తరంగానికి చేసే గాత్రాన్ని కృష్ణ భగవానుని జీవిత ఘట్టాలని క్రోడీకరించే కృష్ణ లీలా తరంగిణి అంటారు.
భామాకలాపం
భామాకలాపంలో గర్విష్టి సత్యభామ, కృష్ణ భగవానుని పాత్రలుం టాయి. సత్యభామ పాత్ర ప్రేమలోని వివిధ పార్శ్వాలని అభినయిస్తుంది. కృష్ణుడికి దూరమైన సమయంలో విరహవేదనని అనుభవిస్తూ, తాము కలసి ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో గుర్తు తెచ్చుకొంటూ అతని గూర్చి కాంక్షిస్తుంది. కృష్ణునికి రాయబారం పంపటంతో ఇద్దరూ కలసి కథని సుఖాంతం చేస్తారు.
కృష్ణ శబ్దం
కృష్ణ శబ్దంలో ఒక గోపిక కృష్ణుణ్ని కలవటానికి ఆహ్వానిస్తుంది. ఈ పాత్రలో ఒక స్త్రీ పురుషుణ్ణి ముగ్ధుణ్ణి చేసే ప్రయత్నంలోని హావభావాలని ఆద్యంతము ప్రదర్శిస్తుంది.