Telugu Marriage Tradition : Pasupu Kottuta – పెండ్లి పనులు మొదలు పెట్టుటకు మంచిరోజు చూసి పసుపు కొట్టవలెను. రోకలికి, రోలుకు, నాల్గువైపులా అరచేతి సైజులో పసుపు పూసి, ఐదు కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగానే రోకలికి కూడా పసుపు పూసి, కుంకుమబొట్లు పెట్టాలి. తరువాత ఐదుపోగుల దారమునకు పసుపురాసి తమలపాకు తోరము ముడివేసి రెండింటికి కట్టవలెను. ముందుగా ఐదుగురు ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి రోటిలో ఐదు పసుపు కొమ్ములు వేసి వారిచే పసుపు కొట్టించవలెను.
ఈ పసుపు కొమ్ములు మెత్తగా నూరి తలంబ్రాలు బియ్యములో కలపవలెను. ముత్తైదువులకు ముఖాన కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూలములు, వారికి ఇవ్వవలెను. ఈ సందర్భంగా తరువాత ఒక చాటలో బియ్యము పోసి ఐదుగురు ముత్తైదువులచే బాగు చేయించవలెను. పెండ్లి కూతురుకు కొత్త చీర కొనిపెట్టవలెను. తరువాత రోజు నుండి ఇంటికి రంగులు వేయించుట మొదలైన అన్ని పెండ్లి పనులు చేయవచ్చును.