దిష్టి తీయటం
Disti tiyadam
Telugu Tradition : Disti tiyadam – దిష్టి అంటే అదే పనిగా మనం (మన వస్తువు, లేదా ఆస్థి) ఇతరుల గమనికలో వుండటం అని చెప్పవచ్చు. తద్వారా వారు మన పట్ల ఈర్ష్య అసూయా భావాలతో లేదా ఆరాధనా భావం లేదా ప్రేమభావంతో భావోద్వేగాలకి గురయ్యి మనకు “ఇబ్బంది” కలుగజేసే అవకాశం ఉంటుంది అని భావం.
పిల్లలకు దిష్టి తీయటం
చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అందులో పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు. అయితే, దిష్టి ఎలా పడితే అలా తీయకూడదనీ, దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలుంటుందని పెద్దలు సూచిస్తున్నారు.
కంటి దృష్టి లోపాలు తొలగిపోవాలంటే.. బుగ్గపై కాటుక పెట్టాలని, అన్నం తినకుండా మారాం చేస్తే కంటి దృష్టి పడి వుంటుందని భావించి.. రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలని, ఆపై ఆ ఉప్పును నీళ్లలో కలిపేయాలి అని అంటారు. ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి.. పసుపు, కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి. ముఖ్యంగా కర్పూ రంతో దిష్టి తీయాలి. అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే.. కర్పూరాన్ని పళ్లెంలోకి తీసుకుని.. పిల్లలను మూడు సార్లు తిప్పి.. పక్కన తీసేయాలి. కర్పూరం కరిగేట్లు కంటి దృష్టి కూడా కరిగి పోతుందని.. విశ్వాసం. అదే విధంగా అర్థరాత్రుల్లోనూ, మిట్ట మధ్యాహ్నం సమయాల్లోనూ పిల్లలను బయట తిప్పకూడదు.
రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి. చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పై విధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి.
రేణుకాదేవి స్మరణ
ఇక దిష్టి తగిలిన వారికి ఉప్పు, మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టూ తిప్పడం అంటే, ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాలను, వలయాన్ని సృష్టిస్తూ విశ్చిన్నం చేయడమన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు అని అంటారు.
దిష్టి తగలకుండా ఉండాలంటే?
హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం, భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చో మని చెప్పడం, లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వడం, , , భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం, కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం, నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం, కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం, తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయ స్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును 7 సార్లు దిగదుడిచి 4 వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం, మంత్రాలు రాసిన తాయెత్తును తీసుకొచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టటం లాంటి పనులు దిష్టి తగలకుండా చేస్తారు.